Anganwadi services | కరీంనగర్ కలెక్టరేట్, జులై 11 : మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు, కూరగాయలు తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ సభకు హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని అన్నారు.
సుమారు 50 వేల ఖరీదు చేసే “ఆరోగ్య మహిళ” ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల అనేక వ్యాధులను ముందస్తుగా గుర్తించి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చని తెలిపారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ఏడాది కాలంలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా మహిళా గ్రూపు సభ్యులు తప్పనిసరిగా ఈ సేవలు వినియోగించుకొని ఇతర మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ, బాలింతలకు, పిల్లలకు అనేక సేవలు అందుతున్నాయని, ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని, ఈ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. బిపి, షుగర్ వంటి వ్యాధులకు సంబంధించిన అన్ని మాత్రలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తాయని, ఖర్చు పెట్టి బయట కొనద్దని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను సంప్రదించినా ఈ మాత్రలను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు నాలుగు ఉచిత వైద్య పరీక్షలతో పాటు టీఫా స్కానింగ్ చేయిస్తున్నామని తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్లో చేరి పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు.
శుక్రవారం సభ లక్ష్యాలు నెరవేర్చుతున్నాం.. : కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదికాలంగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. మహిళలకు కుటుంబ, ఆరోగ్య తదితర సమస్యలు ఏమున్నా శుక్రవారం సభలో వెల్లడించవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య పరీక్షలు, ఆహార నియమాలు, పిల్లలు ఆరోగ్యం పై శుక్రవారం సభలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్ , సీడీపీవో సబిత, వైద్యారోగ్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.