Godavarikhani | కోల్ సిటీ, మే 26: కాళేశ్వరం క్షేత్రంలో గత 12 రోజుల పాటు జరిగిన సరస్వతీ పుష్కరాలలో శ్రీ భ్రమరాంబిక సేవకులు స్వచ్ఛందంగా సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. భ్రమరాంభిక సంస్థ అధ్యక్షురాలు మహాలక్ష్మీ ఆధ్వర్యంలో గోదావరిఖనికి చెందిన సంస్థ సభ్యులు 12 రోజుల పాటు కాళేశ్వరంలోనే ఉంటూ పుష్కర భక్తులకు సేవలందించారు.
సంస్థ తరఫున స్వీయ ఖర్చులతో భక్తులకు ఉచితంగా మజ్జిగ, చల్లటి మంచినీళ్లు అందించారు. పుష్కర స్నానాల అనంతరం దేవస్థానంలో ముక్తీశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులు క్యూ లైన్లలో తాగునీటికి అలసట చెందకుండా మజ్జిగ, చల్లటి మంచినీళ్లను అందించినట్లు తెలిపారు. కాగా పుష్కరాల ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో సంస్థ సభ్యులను దేవస్థానం పాలక వర్గం, అధికారులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
12 రోజుల పాటు భక్తులకు అందించిన సేవలను ప్రశంసించారు. కాగా, మహి మాన్వితమైన కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాలలో సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు అధ్యక్షురాలు మహాలక్ష్మీ తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖనికి చెందిన భ్రమరాంభిక సంస్థ సభ్యులు పాల్గొన్నారు.