Korutla | కోరుట్ల, జూలై 27: కోరుట్లలో అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంకర తేలి రాకపోకలకు ఇబ్బంది కరంగా మారాయి. మోస్తారు వర్షానికే అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా తయారయ్యాయి. గతుకులు, గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. రోడ్లపై వర్షపు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో, ఎపక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
అంతర్గత రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారి, చినుకు పడితే చిత్తడిగా మారి కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కంకర తేలిన రహదారుల్లో ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే పట్టణంలోని జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్ చేసిన కొద్దిపాటి వర్షంతో మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది.
స్థానిక నంది చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలు వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. పలుమార్లు గుంతలో వాహనాలు పడి ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. సంబంధిత అధికారులు రహదారులను బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.