Commissioner meeting | కోల్ సిటీ, జూన్ 5: రామగుండం నగరపాలక సంస్థ ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్) పై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆయా డివిజన్లలో దొర్లిన తప్పులపై నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీకి గురువారం రాత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. రామగుండం కార్పొరేషన్ లో వెంకట్రావు పల్లి, లింగాపూర్, ఎల్కలపల్లి గేట్. అక్బర్ నగర్ ప్రాంతాలను కలుపుతూ 60 డివిజన్లకు పునర్విభజన చేశారు. దీనిపై నగర పాలక సంస్థ కమిషనర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ‘ఐతే ఒక్కరోజులోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏలా సాధ్యమైంది’ అన్న శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం ప్రచురితమైన ప్రత్యేక కథనంకు కమిషనర్ స్పందించారు. ఈమేరకు గురువారం నగర పాలక కార్యాలయంలో 50 డివిజన్ల వార్డు ఆఫీసర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
శుక్రవారం నుంచి ప్రతివార్డులో ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేయాలని ఆదేశించారు. విభజన అంశంపై పారదర్శకత పాటించే విధి విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తక్కువ గడువులోనే నోటిఫికేషన్ రూపొందించాల్సి వచ్చిందనీ, ఇదే తుది జాబితా కాదనీ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను పరిగణలోకి తీసుకొని సీడీఎంఏకు పంపించాక ఈనెల 21 వరకు చివరి గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని స్పష్టం చేశారు. ఆయా డివిజన్ల ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దన్నారు.
వారం రోజుల గడువులో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఆమె కోరారు. శుక్రవారం నుంచి క్షేత్ర స్థాయిలో 60 డివిజన్లలో భౌగోళిక హద్దుల ఆధారంగా సర్వే చేస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా చుట్టు ప్రక్కల నాలుగు గ్రామాల విలీనం వల్ల నగరంలోని డివిజన్లలో ఇంటి నంబర్ల గల్లంతు ఏలా జరుగుతుందని 33వ డివిజన్ కు చెందిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ కమిషనర్ కు ఆక్షేపణ పత్రంను అందజేశారు. తమ డివిజన్ లో దాదాపు 800 గృహాలు జాబితా నుంచి తొలగించారని, మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి తొలగించిన గృహాలను యధాస్థానంలో చేర్చాలని కమిషనర్ ను కోరారు.
అలాగే తిలకనగర్ ప్రాంతంలోని కొన్ని గృహాలు 33వ డివిజన్ లో చేర్చారని మాజీ కౌన్సిలర్ బొబ్బిలి సతీష్ కమిషనర్ కు ఆక్షేపణ పత్రంను అందజేశారు. దుర్గానగర్ లో కూడా చాలా వరకు ఇంటి నెంబర్లు గల్లంతైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ముసాయిదాపై పోస్టుమార్టంకు చర్యలకు ఉపక్రమించారు.