వేములవాడ, డిసెంబర్ 9: నేటితరం చిన్నారులు ఉదయం నుంచి రాత్రి వరకు సమయం దొరికినప్పుడల్లా సెల్ఫోన్, ఫోన్, కంప్యూటర్, టీవీలాంటి వాటికి అతుక్కుపోతున్నారు. అందివచ్చిన సాంకేతికతను ఆసరాగా చేసుకున్న నేటి తరంలో చేతిరాత కనుమరుగవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోస్టుకార్డు ద్వారా వ్యాసం రాసి ప్రధానికి పంపే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భారతదేశ పోస్టల్ శాఖ, విద్యా శాఖ కలిసి సంయుక్తంగా విద్యార్థులకు పోస్టు కార్డుల ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీలోగా పోస్టుకార్డులపై రాసి ప్రధానమంత్రికి పోస్టు చేయాల్సి ఉంటుంది. దేశంలో 75 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటుండగా ప్రతిభ చూపిన 75 మందితో 2022 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖాముఖి కానున్నారు.
పోస్టు కార్డు ఇలా…
పోస్టు కార్డుపై విద్యార్థులు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న 2047 నాటికి దేశం ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ నాలుగైదు లైన్లు రాయాలి. దేశ స్వాతంత్య్రోద్యమంలో మనం గుర్తించని పోరాట యోధుల గురించి కూడా నాలుగు లైన్లు రాసి పంపాలి. అలాగే పాఠశాల విద్యార్థుల వివరాలు కూడా అందులో పొందుపర్చాలి.
రాజన్నసిరిసిల్లలో 10వేల మంది విద్యార్థులతో..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో పది వేల మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. 4 తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ కార్డులు అందజేయనున్నారు. ప్రతి పాఠశాలలో 10 మందిని ఎంపిక చేసి ఆన్లైన్లో వివరాలను పాఠశాల ఉపాధ్యాయులు పొందుపరచనున్నారు. ఇలాదేశం మొత్తంలో 75 లక్షల మంది విద్యార్థులు పోస్టుకార్డుల ద్వారా తమ అమూల్యమైన ఆలోచనలను పొందుపరిచి ప్రధానికి పోస్టు చేయనున్నారు. ఇందులో దేశం మొత్తం 75 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
జనవరి 3వ వారంలో ప్రధానితో ముఖాముఖి..
వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న 75 లక్షల మంది విద్యార్థుల నుంచి 75 మందిని ఎంపిక చేస్తారు. ప్రతిభ చూపిన 75 మందితో 2022 జనవరి 3వ వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఢిల్లీలో ముఖాముఖి కానున్నారు.