పండుగపూట పంచాయతీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పస్తులుండాల్సి వస్తున్నది. పొద్దున లేచింది మొదలు పల్లెల బాగు కోసం పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు రెండు మూడు నెలలుగా, చిన్న జీపీల్లో అయితే ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల జీవితం అధ్వానంగా మారింది. కనీసం పండుగకు కనీసం కొత్తబట్టలు కొనుక్కోలేని దుస్థితి దాపురించింది. ఇన్నాళ్లూ నేడో, రేపో వస్తాయని ఎదురు చూసినా ఇప్పటి వరకు రాకపోవడంతో నిరాశే మిగులుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో వీధులు ఊడ్చి, మురుగు కాలువలు శుభ్రం చేసి, వీధిలైట్లు వేయడం, మంచినీటిని సరఫరా చేసే విధులు నిర్వహించే పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు మూడు నాలుగు నెలులుగా వేతనాలు అందడం లేదు. బతుకమ్మ, దసరా పండుగలకు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో వీరికి పంచాయతీలే చెల్లించేవి. బీఆర్ఎస్ పాలనలో మాత్రం ప్రభుత్వం నుంచి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకున్నది.
పారిశుధ్యం, పంప్ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, కారోబార్ వరకు అందరినీ మల్టీపర్పస్ వర్కర్లుగా తీసుకుని అందరికీ సమాన వేతనాలుగా 9,500 ఖరారు చేసింది. కరీంనగర్ జిల్లాలో ఈ విధంగా 323 పంచాయతీల్లో 1,385 మంది వర్కర్లు ఉన్నారు. గతంలో వీరి వేతనాలు ప్రతి నెలా చెల్లించేవారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి విడుదల కాకపోతే పంచాయతీలు చెల్లించి ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత జమ చేసుకునేవారు.
ఇప్పుడు జీపీల్లో నిధులు లేక పోవడం, ఉన్నా కొన్నిచోట్ల ప్రత్యేకాధికారులు సరిగ్గా కార్యాలయాలకు రాక సిబ్బంది వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతున్నది. మూడు నాలుగు నెలలుగా సుమారు అన్ని జీపీల్లో వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబాలు గడువక కొందరు ఇతర పనుల్లోకి వెళ్లాల్సి వస్తున్నది. అయితే ఇటీవల మూడు నెలల వేతనాల గ్రాంటును విడుదల చేయగా, ఇప్పటి వరకు పంచాయతీ వర్కర్ల చేతికి అందలేదు. దీంతో డీపీవో కార్యాలయం ఎదుట పంచాయతీ వర్కర్లు ధర్నా చేయాల్సి వచ్చింది.
జీపీ అధికారులు కూడా ఇప్పుడు ఆయా పంచాయతీలకు వేతనాల చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చెక్కులు ట్రెజరీలో అప్రూవల్ అయిన తర్వాత పంచాయతీ కార్మికుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ జరిగేందుకు కనీసం మూడు నాలుగు రోజులైనా పడుతుందని పంచాయతీ వర్కర్లు చెబుతున్నారు.
అంటే సద్దుల బతకమ్మ, దసరాకు పంచాయతీ కార్మికులకు వేతనాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో సర్పంచులు ఉన్నప్పుడు జీపీల్లో సాధారణ నిధులు లేకున్నా కొందరు సర్పంచులు వేతనాలు సమకూర్చినా ఇప్పుడా పరిస్థితి లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సర్పంచుల పదవీ కాలం ముగియడం, ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండడంతో పంచాయతీ వర్కర్లను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.