కరీంనగర్ కలెక్టరేట్/ తెలంగాణచౌక్, జనవరి 1: ఇచ్చిన హామీ మేరకు తమకు కూలి రేట్లు పెంచాలంటూ పౌరసరఫరాల శాఖ గోదాముల హమాలీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి వారంతా విధులు బహిష్కరించి, నిరవధిక సమ్మెకు దిగారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న గోదాముల్లో సమ్మె కొనసాగుతుండగా, నగరంలోని పద్మనగర్, గోదాంగడ్డ వద్ద గోదాముల ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాలను సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. కూలి ధరలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించి, మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల చేయకపోవడం కార్మిక వ్యతిరేక విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే ఒప్పందానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాత పద్ధతులే అమలు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అసంఘటితరంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన కార్మిక కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, స్థలాలు ఉన్నవారికి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు అందించి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ నిరవధిక సమ్మె శిబిరంలో సివిల్ సైప్లె కార్పోరేషన్ హమాలీ ప్రతినిధులు అంజయ్య, రాజయ్య, మల్లయ్య, శ్రీధర్, కనకయ్య, రాజమల్లు, లక్ష్మి, గడ్డి లక్ష్మయ్య, ఏఐటీయూసీ జిల్లా అధక్ష్య,కార్యదర్శులు కటికరెడ్డి బుచ్చన్న, టేకుమల్ల సమ్మయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు