ఇందిరమ్మ ఇండ్లు పక్కదారి పడుతున్నాయా..? అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు, వారి బంధువులకు మాత్రమే కేటాయిస్తున్నారా..? అర్హులైన పేదలు అడిగితే రూ. వేలల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారా..? అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అవుననే అనిపిస్తున్నది. ఇండ్ల మంజూరులో ఇందిరమ్మ కమిటీల జోక్యం పెరుగుతున్నదని, రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అర్హులను వదిలి కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులకు ఇండ్లు కేటాయిస్తున్నారంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల నిరుపేదలు ఆందోళనకు దిగుతున్నారు. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పినదానికి విరుద్ధంగా జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. నిరుపేదలను కనికరించడం లేదని, అర్హులకు తమకు అన్యాయం జరుగుతున్నదని వాపోతున్నారు.
కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ) : ఇండ్ల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదానికి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి విరుద్ధంగా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లతోపాటు మరో మూడు పథకాలను జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని మండలానికో పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం ఈ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు కూడా నత్తనడకనే నడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 15 పైలెట్ గ్రామాల్లో 3,813 మంది దరఖాస్తు చేసుకోగా, 2,316 మందిని ఎంపిక చేశారు.
ఫిబ్రవరి, మార్చిలో ముగ్గులు పోసే కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 750 మంది లబ్ధిదారులు ముగ్గులు పోసుకున్నట్టు, అందులో 92 మందే పునాదులు తవ్వుకున్నట్టు తెలిసింది. అయితే బేసిమెట్ లెవల్ పూర్తి చేసిన కొందరికీ బిల్లుల కోసం అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఉండగా, ఇద్దరు ముగ్గురికి మాత్రమే బేసిమెట్ లెవల్‌కు బిల్లులు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు పటిష్టమైన వ్యవస్థ కూడా లేదనే తెలుస్తున్నది. ఒక పీడీతోపాటు డివిజన్‌కు ఒక ఏఈని కేటాయించారు. హుజూరాబాద్ డివిజన్లో 6 మండలాలు, కరీంనగర్ డివిజన్లో 9 మండలాలకు ఒకే ఏఈ ఉంటే.. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఏవిధంగా పర్యవేక్షణ చేస్తుందనేది అనుమానంగానే ఉన్నది.
పైలెట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండగా, మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ ఎంపిక బాధ్యతలను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడంతో గందరగోళ పరిస్థితి తలెత్తుతున్నది. అర్హులను వదిలి కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు, పార్టీ సానుభూతిపరులకే ఇండ్లు కేటాయిస్తున్నారని నిరుపేదలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే అనేక చోట్ల రోడ్లెక్కారు. శనివారం శంకరపట్నం మండలం మొలంగూరులో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీల జోక్యాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.
ఆదివారం సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్‌లో ఓ నిరుపేద తడవేని భవాని తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పొయ్యి పెట్టి నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన వెంకటేశ్ అనే దివ్యాంగుడు ఏకంగా మున్సిపల్ కార్యాలయం ఎక్కి ఆందోళన చేశాడు. కాంగ్రెస్ నాయకులు వారి బంధువులు, కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారని ఆరోపించాడు. ఇందిరమ్మ ఇండ్లలో దివ్యాంగులకు 5 శాతం ఇస్తామని చెప్పి, జమ్మికుంట పట్టణంలో ఒక్కరికీ కూడా కేటాయించ లేదని వాపోయాడు.
అదే రోజు ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేరు రాలేదని మహిళలు ధర్నా చేశారు. అకడే ఉన్న నీళ్ల ట్యాంకు ఎకి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని ధర్నాను విరమింపజేశారు. తాజాగా శుక్రవారం కూడా వీణవంక మండలం కోర్కల్‌లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో ఉన్న నాయకులను తమకు ఇల్లు కావాలని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించడం సంచలనంగా మారింది. అలాగే చిగురుమామిడి మండలం సుందరగిరిలో కూడా స్థానికులు తమకు ఇండ్లు ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సిఫారసు చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. అయితే అందులో అర్హులెవరు? అనర్హులెవరు? అనే విషయాలను కమిటీలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కమిటీల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మొదటి ప్రాధాన్యతగా తమ పార్టీ కార్యకర్తలు, బంధువులకే ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఇండ్లు లేని నిరుపేదలు, స్థలాలు ఉండి ఇండ్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఇది వరకే ఇండ్లు నిర్మించుకున్న వారి పేర్లను కూడా కమిటీలు సిఫారసు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇండ్లు ఉన్న వారికి కూడా జాబితాలో చోటు దక్కడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. వీణవంక మండలం కోర్కల్‌లో ఇదే జరిగింది. అందుకే ఈ గ్రామానికి చెందిన నిరుపేదల ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఇక ఇల్లు కావాలంటే ఇందిరమ్మ కమిటీలు 20వేల నుంచి 30 వేలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కమిటీల్లో సభ్యులుగా ఉన్న నాయకులకు కొందరు డబ్బులిచ్చి తమ పేర్లు జాబితాలో వచ్చేలా చేసుకుంటున్నారని తెలుస్తున్నది. ఇంతటి వ్యవహారం నిర్వహిస్తున్న ఇందిరమ్మ కమిటీలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇండ్ల మంజూరులో కమిటీల జోక్యం పెరుగుతున్నదని, రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారని, తిందామంటే తిండి లేని తాము ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేదని నిరుపేదలు వాపోతున్నారు. నిలువ నీడ లేని నిరుపేదలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి కనిష్ఠంగా 400 చదరపు అడుగులు ఉండాలని నిబంధనలు విధించారు. గరిష్ఠంగా 600 చదరపు అడుగులకు మించరాదని అధికారులు చెబుతున్నారు. అయితే జనవరిలో ప్రొసీడింగ్ పత్రాలు ఇచ్చినప్పుడు తమకు ఈ విషయం చెప్పలేదని చాలా మంది లబ్ధిదారులు అంటున్నారు. ఈ విషయం తెలియని కొందరు లబ్ధిదారులు 600 చదరపు అడుగులకు మించి బేస్మిట్లు నిర్మించుకున్నారు. వీరి పేర్లను ఆన్లైన్లో నమోదు చేస్తే తిరస్కరిస్తున్నట్టు ఇపుడు అధికారులు చెబుతున్నారు. స్థలాలు ఉంటే ఇల్లు కట్టుకోండి, 5 లక్షలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు 600 అడుగులకు ఒక్క అడుగు ఎక్కువైనా ఆమోదించకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
బేస్‌మెట్లు స్థాయికి చేరుకున్న వారిలో ఎక్కువ మంది ఇదే పరిస్థితిలో ఉన్నారని తెలుస్తున్నది. తమకు ఇచ్చిన ప్రొసీడింగ్ పత్రాల్లో కూడా ఇల్లు ఎంత విస్తీర్ణంలో నిర్మించుకోవాలనే విషయాన్ని ప్రస్తావించ లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. 400 చదరపు అడుగులు కనీసంగా ఉంటే బిల్లులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించే విషయంలో కూడా లబ్ధిదారుల్లో ఆందోళన చెందుతున్నారు. కనీసం బేస్మెట్ స్థాయిలో లక్ష, లెంటర్ స్థాయిలో 1.25 లక్షలు, స్లాబ్ స్థాయిలో 1.75 లక్షలు చివరి స్థాయిలో లక్ష చొప్పున మొత్తం 5 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టుకున్నారు. అయితే, ఆయా స్థాయిల్లో ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అదనంగా బేస్మెట్ స్థాయిలోనే అదనంగా 50 వేల నుంచి లక్ష ఖర్చు వస్తుందని, ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలంటే అదనపు ఖర్చులు తమకు భారంగా మారతాయని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 2 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చెందిన పండుగు సత్తవ్వ భర్త విజయ్ 25 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. చిన్న గుడిసెలో నివాసముంటుండగా ఆమెకు ఇల్లు మంజూరైంది. దీంతో బేస్మెంట్ పూర్తి చేసి పిల్లర్లు కూడా పోయించింది. తీరా అధికారులు బేస్మింట్ కొలతలు చూసి 600 చదరపు అడుగులు దాటిందని, బిల్లు రాదని చెప్పడంతో ఆమె ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బుకు కొంత అప్పు చేసి ఇల్లును పూర్తి చేసుకుంటామని, ఇప్పటికిప్పుడు దాన్ని తగ్గించడం ఇబ్బందేనని అంటూ తమకు బిల్లు మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నది. సత్తవ్వ ఒక్కతే కాదు, ఎంతో మంది లబ్ధిదారులు ఇలానే ఇబ్బంది పడుతున్నారు. పలు సందర్భాల్లో నచ్చిన కొలతల్లో ఇల్లు కట్టుకోవాలని, 5లక్షలు ఇస్తామని చెప్పినా.. ఇప్పుడు ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండడంతో అయోమయం చెందుతున్నారు. పైగా 600 చదరపు అడుగులకుపైన నిర్మాణం చేపడితే బిల్లు నిరాకరిస్తుండగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీణవంక/ చిగురుమామిడి, మే 2 : ‘ఇండ్లు ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తరా..? పేదోళ్లకు ఇవ్వరా..?’ అంటూ వీణవంక మండలం కోర్కల్, చిగురుమామిడి మండలం సుందరిగిరి గ్రామాల్లో ఆశావహలు ఆందోళన చేశారు. శుక్రవారం కోర్కల్ గ్రామ బస్టాండ్ వద్ద కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై వాహనాలు సుమారు గంటపాటు నిలిచిపోయాయి. అలాగే అర్హులకు ఇండ్లు ఇవ్వాలని సుందరగిరి గ్రామ పంచాయతీ ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల వారు మాట్లాడుతూ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వారికి నచ్చినోళ్ల పేర్లు రాసుకుంటున్నారని మండిపడ్డారు. అటు అధికారులు, ఇటు కాంగ్రెస్ కమిటీ సభ్యులు అసలైన పేదోళ్లను గాలికి వదిలేసి ఇప్పటికే సగం పూర్తయిన ఇండ్లకు మంజూరు రాస్తున్నారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులు 20 వేలు ఇస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
తమకు ఇండ్లు లేవని, తాము దరఖాస్తు చేసుకున్నా జాబితాలో తమ పేర్లు లేవని వాపోయారు. సుందరగిరి పంచాయతీ కార్యదర్శి అర్హుల జాబితా చూపించడం లేదని మండిపడ్డారు. కోర్కల్‌లో ఇక్కడ మాజీ సర్పంచ్ మర్రి వరలక్ష్మి స్వామి, ఉపసర్పంచ్ పూదరి అనిల్, కృష్ణ, కొలిపాక రాకేశ్, ఆంజనేయులు, రాజ్‌బాబు, తిరుపతి, మల్లయ్య.. సుందరగిరిలో ఎనగందుల తేజశ్రీ, ఎనగందుల రాజేశ్వరి, జేరిపోతుల శ్రీనివాస్, వంతడుపుల శ్రీనివాస్, ఎనగందుల తిరుపతి, ఎనగందుల సారవ్వ, ఎనగందుల మహేందర్, పంతడుపుల రజిత, కిన్నెర పూజలత, జేరిపోతుల సంజీవ్ ఉన్నారు.