Theft Case | గంగాధర, జూన్ 14 : తాను పంచాయతీ కార్యదర్శిని, మీ గ్రామానికి కొత్తగా బదిలీపై వచ్చానని, నీకు రూ.4వేల పెన్షన్ ఇప్పిస్తానని గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలిని నమ్మించి ఆమె వద్ద ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ కథనం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం, నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన గోలి వజ్రమ్మ(80) అనే వృద్ధురాలు తన కూతురు ఇంటికి వెళ్లి శనివారం ఉదయం తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. వృద్ధురాలి ఆరోగ్యం బాగా లేకపోవడంతో గంగాధరలో డాక్టర్ కు చూపించుకోవాలని అనుకుంది.
గంగాధర బస్టాండ్ లో బస్సు దిగి ఆసుపత్రి వైపు నడుచుకుంటూ వెళ్లుతోంది. మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి వద్దకు వచ్చి తాను పంచాయతీ కార్యదర్శి అని, గ్రామానికి కొత్తగా బదిలీపై వచ్చానని, రూ.4వేల పెన్షన్ ఇప్పిస్తానని వృద్ధురాలిని నమ్మించాడు. పెన్షన్ రావడానికి ఫోటో తీసుకోవాలని, ఫోటో తీయాలంటే ఒంటిపై నగలు ఉండకూడదని వృద్ధురాలికి సూచించాడు. దీంతో దుండగుడి సూచన మేరకు తన మెడలో ఉన్న తులం బంగారు గొలుసు, 12 గురిజల చెవి కమ్మలు, రూ.ఒక వెయ్యి నగదు తీసి గుర్తు తెలియని దుండకుడికి ఇచ్చింది.
దీంతో ఫొటో తీస్తున్నట్టు నమ్మించిన దుండగుడు నగలు, డబ్బుతో అక్కడి నుండి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు రోదించడంతో గమనించిన స్థానికులు గంగాధర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరచిత వ్యక్తులను నమ్మవద్దని, ఇండ్లకు తాళం వేసి వెళుతున్న క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానిత వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై మండల ప్రజలకు సూచించారు.
Police register case of theft of elderly woman’s jewelry