వేములవాడ, జూన్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వడ్డీ, అనుమతులు లేని చిట్ ఫండ్ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏకకాలంలో 20 పోలీసు బృందాలు 20 నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. వేములవాడ పట్టణంలోని కుమ్మరిగుడి వద్ద గల ఓ వడ్డీ వ్యాపారి కార్యాలయానికి తాళం వేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పోలీసులు కార్యాలయం తాళాన్ని తొలగించి మరీ తనిఖీలు నిర్వహించారు. ఓ బీరువాకు కూడా తాళం వేసి ఉండగా, తీసే ప్రయత్నం చేసినప్పటికీ తెరుచుకోకపోవడంతో సదరు నిర్వహకుని కోసం అర్ధరాత్రి వరకు ఒక ఎస్ఐతో కాపాలా కాశారు.
ఇక నాలుగు గంటలపాటు రెండు పట్టణాల్లో సోదాలు నిర్వహించిన పోలీసు బృందాలు వడ్డీ వ్యాపారులు, అనుమతులేని చిట్ ఫండ్ వ్యాపారుల నుంచి దాదాపు భారీగా నగదు, చెకులు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత నాలుగేళ్ల క్రితం ఇదే తరహాలో దాడులు నిర్వహించిన పోలీసులు, మరోసారి ఈ దాడులు నిర్వహించగా అక్రమ వడ్డీ వ్యాపారుల్లో వణుకు పుట్టింది. మరి కొందరిపైనా మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.