కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కారు నిర్లక్ష్యం రైతులకు శాపంలా మారింది. సకాలంలో ధాన్యం కొనకపోవడంతో నిండా మునగాల్సి వస్తున్నది. మంగళవారం రాత్రి 8గంటల తర్వాతి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు పడిన అకాల వర్షంతో రెక్కల కష్టం నీళ్లపాలయింది. పంట కొంటారని రోజుల కొద్ది చూసినా చివరకు నష్ట పోవాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం తర్వాత ఆకాశం మేఘావృతమై, ఒక్కసారిగా గాలి దుమారం లేచింది. కాసేపట్లోనే వర్షం మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
ఆగమేఘాల మీద టార్పాలిన్లు కప్పారు. అయినా గాలులు బలంగా వీయడంతో కొన్నిచోట్ల కవర్లు లేచిపోయి వడ్లు, బస్తాలు తడిపోవడంతో కంటతడి పెట్టారు. కండ్లముందే ధాన్యం తడిసిపోవడం చూసి రోదించారు. కొందరు రైతులు బుధవారం తెల్లవారు జామునే కొనుగోలు కేంద్రాలకు చేరుకొని, అక్కడ నెలకొన్న పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కుప్పలతోపాటు సంచుల్లో నింపి తూకం వేసి మిల్లలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసి ముద్దకావడంతో కన్నీరుమున్నీరయ్యారు. పైన కవర్లు కప్పామని ధీమాగా ఉన్నా.. కింద నుంచి వరద పోయి తడవడంతో ఆవేదనకు లోనయ్యారు.
తడిసిన వడ్లను, బస్తాలను ఆరబెట్టేందుకు.. కుప్పల చుట్టూ నిలిచిన నీళ్లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. తడిసిన ధాన్యాన్ని, కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎత్తుతూ ఈ గోస ఎవరికీ రావొద్దని కన్నీరు పెట్టారు. రక్షణ కోసం కప్పిన కవర్లు గాలి దుమారానికి కొట్టుకుపోయాయని, ఇన్ని రోజులపాటు పడ్డ శ్రమ అంతా వృథా అయిందని వాపోయారు. సర్కారు నిర్లక్ష్యమే తమకు శాపంలా మారిందని మండిపడ్డారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని ఆగ్రహించారు. ఇప్పటికైనా అధికారులు సత్వరమే కొనుగోళ్లు పూర్తి చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

విప్ స్వగ్రామంలో రైతుల అవస్థలు
రుద్రంగి, మే 27 : ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో రైతులు అరిగోస పడుతున్నారు. పంట పండించడానికే కాదు, ధాన్యాన్ని అమ్ముకునేందుకూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాత్రి పడిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో కంటతడి పెడుతున్నారు. నెల క్రితం ధాన్యం మ్యాశ్చర్ వచ్చినప్పటికీ తూకం వేయడం లేదని, వారం క్రితం తూకం వేసిన బస్తాలు తరలించకపోవడంతోనే ఇప్పుడు వానకు బస్తాలు తడిసిపోయాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా విప్ ఆది శ్రీనివాస్ దృష్టి సారించాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
రైతుల గోస సర్కారుకు తాకుతది
ఆరుగాలం కష్టపడితే పంట చేతికచ్చింది. అమ్ముదామని కేంద్రానికి వడ్లు తెచ్చి అరిగోస పడుతున్నం. నిర్వాహకులు కొనుగోలు బాధ్యతలన్నీ రైతులకే రుద్దుతున్నరు. వడ్లు తెచ్చి పద్దెనిమిది రోజులు దాటినా కొనలే. ఓ రోజు ధర్నా చేస్తే గన్నీ సంచులు ఇచ్చిన్రు. నాలుగు రోజులు దాటింది. ఇప్పుడు హమాలీలు లేరని కాంట పెడ్తలేరు. నిన్న వర్షం పడుతున్నదని కుప్పపైన కవరు కప్పిన. కానీ, వరదతో అడుగున ధాన్యం తడిసింది. వడ్లు అమ్ముదామంటే ఇంత గోసనా..? ఇదేనా రైతుల మీదున్న చిత్తశుద్ధి? మా గోస సర్కారుకు తప్పకుండా తాకుతది.
– కోట భూమయ్య, రైతు (గంభీరావుపేట)
ఆరు బస్తాల వడ్లు వరద పాలైనయి
నేను కరీంనగర్ మార్కెట్‌కు వడ్లు తెచ్చి ఇరవై ఐదు రోజులైంది. సంచులు లెవ్వంటే ఇన్ని రోజుల దాక చూసిన. మార్కెట్ నిండా వడ్లు ఉండి జాగా లేకుంటే కింది భాగంలో కుప్ప పోసిన. రెండు ఎకరాల్లో సాగు చేస్తే నాలుగు ట్రాక్టర్ల దిగుబడి వచ్చింది. రాత్రి పడ్డ వానకు పై నుంచి వరద ఎక్కువ వచ్చింది. కుప్ప నుంచి వరద పోయి వడ్లు కొట్టుకపోయినయి. వరదల ఆపడానికి ప్రయత్నం చేసినా ఆగలే. సుమారు ఆరు బస్తాల వడ్లు నీళ్లపాలయినయి. కొట్టుకుపోయిన వడ్లను ఎత్తి ఆరబోస్తున్న. ఇప్పటికైనా సంచులు ఇచ్చి తడవని వడ్లను ఎత్తి కాంటా పెట్టాలే. లేకుంటే చేసిన కష్టమంతా నీళ్లపాలైతది.
– రెవెల్లి మల్లయ్య, కిసాన్‌నగర్
