KARIMNAGAR | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 11 : బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే 199 వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని జ్యోతిబా మైదానంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురామ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలే ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని కొనియాడారు. సమాజంలోని కుల వివక్షను రూపు మాపడానికి జీవితాన్నే ధారపోశారన్నారు. చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన భార్య సావిత్రి బాయి పూలే చదువు నేర్పించి బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శ మూర్తి అన్నారు. పూలే జీవించి ఉన్నంత కాలం బడుగుల అభ్యున్నతి కి కృషి చేసిన మహనీయుడిని బీసీ సమాజం గుర్తుంచుకుంటుందని తెలిపారు.
భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతీ బీసీ ముందుండాలని పిలుపునిచ్చారు. జ్యోతిబా పూలే మైదానంలో పూలే పుణ్య దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, దుప్పటపల్లి మురళి, గుమ్మడి శ్రీనివాస్, సుధాకర్ చారి, బీసీ అఖిలపక్ష నాయకులు సిరి శెట్టి రాజేష్ గౌడ్, బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.