ఎల్లారెడ్డిపేట, మే 4: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికే ‘ఠాణా దివస్’ నిర్వహిస్తున్నామని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సామాన్యులు నిర్భయంగా పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అందజేయాలని కోరారు. గురువారం ఠాణా దివస్‌లో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ప్రజల నుంచి 112 ఫిర్యాదులను స్వీకరించారు. పలువురితో మాట్లాడి సమస్యల వివరా లు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ భూ సంబంధ వ్యవహారాల్లో నేర సంబం ధ అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు.
మధ్యవర్తిత్వం పేరిట డబ్బులు వసూలు చేసే వారిపై కూడా నిఘా పెట్టామన్నారు. కోర్టులో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటివ్యసనాలకు బానిసలు కావద్దని ఉద్బోధించారు. వ్యసనాల బారిన పడిన వారు ఎవరైనా ఉంటే తమ వద్దకు తీసుకువస్తే కౌన్సెలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఇటీవల వేములవాడలో నిర్వహించిన ఠాణా దివస్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో 13 మందిపై కేసు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. బాబాల ముసుగులో, మైనర్లపై అక్రమాలు చేస్తున్న వారిపై అర్జీలు వస్తే వారిపై తక్షణమే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ డీఎస్పీ విశ్వప్రసాద్, సీఐ మొగిలి, ఎస్ఐ శేఖర్ సిబ్బంది ఉన్నారు.