Karimnagar | ముకరంపుర, జూన్ 6 : మే నెలకు సంబంధించిన పెన్షన్ ఇంత వరకు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థ పెన్షనర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలోనూ సకాలంలో పెన్షన్ చెల్లించినా, ప్రస్తుతం మాత్రం జూన్ 6 వ తేదీ వరకు కూడా పెన్షన్ చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ పరిధిలో అన్ని క్యాడర్లకు చెందిన 2వేల మంది పెన్షనర్లు ఉన్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ చెల్లింపుల కోసం జెన్కో లో ప్రత్యేకంగా ట్రస్ట్ ఉందని, ప్రతినెలా ఇదే ట్రస్ట్ ద్వారా తమకు పెన్షన్ విడుదల అవుతుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం రైతు డిస్కం ఏర్పాటుపై ఈఆర్సీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పలువురు విద్యుత్ విశ్రాంత ఉద్యోగులు రైతు డిస్కం ఏర్పాటుపై వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలియజేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వినియోగదారుల ప్రయోజనాలు, సంస్థ భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకునే రిటైర్డ్ ఉద్యోగులు తమ అభిప్రాయాలు తెలియజేశారే తప్ప తాము ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. ఇప్పటి కైనా వెంటనే పెన్షన్ ను ఒకటవ తేదీనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.