Collector Koya Sri Harsha | పెద్దపల్లి ఆగస్టు 25 : పెద్దపల్లి జిల్లాలో చేయూత ఫించన్లను సులభ పద్ధతిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పెన్షన్లు పంపిణీ చేసే పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్లకు ఎఫ్ఆర్ఎస్ మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను సోమవారం అందజేశారు.
ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డ చేయూత పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం నేరుగా ముఖ గుర్తింపు పద్ధతి ఆధారంగా (ఎఫ్ఆర్ఎస్) పోస్టల్ పింఛన్లు సులభముగా పంపిణీ చేసేందుకు 22 మంది పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్లకు మొబైల్స్, బయోమెట్రిక్ యంత్రాలను (మంత్ర డివైజ్) అందిస్తున్నామన్నారు. మంథని, జూలపల్లి, రామగిరి, సుల్తానాబాద్ మండలాల్లోని 44 గ్రామాలలో 6921 మంది పింఛనుదారులకు సులభంగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కాళిందిని, అదనపు డీఆర్డీవో రవీందర్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.