Pegadapalli | పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన నిమ్మని రమేశ్ (55) అనే వ్యక్తి ఇరాక్ లో గుండె పోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం ఏడాది క్రితం ఇరాక్ దేశానికి వెళ్లిన రమేశ్, బుధవారం ఇంటికి వచ్చేందుకు గాను మంగళవారమే విమాన టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం రమేశ్ గుండె పోటుకు గురికాగా, స్థానికులు హాస్పిటల్ కు తరలించారని, చికిత్స పొందుతూ రమేశ్ రాత్రి మృతి చెందినట్లు వారు వివరించారు.
రమేష్ కు భార్య లక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. ఇంటికి వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేసుకుని రావడానికి సిద్దమవుతున్న నేపధ్యంలో రమేశ్ గుండె పోటుతో ఇరాక్ లోనే మృతి చెందడం పట్ల పెగడపల్లిలో విషాదం నెలకొంది. అతడి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రమేశ్ మృత దేహం త్వరగా స్వగ్రామం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.