కోల్ సిటీ, అక్టోబర్ 21: పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టింది. గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపార సంస్థల నిలయంలో కూల్చివేతల చర్యలకు సిద్ధమైంది. మంగళవారం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సిబ్బందితో చేరుకొని కళ్యాణ్ నగర్ లో నూతనంగా విద్యుత్ స్తంభాల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భవనాల బాల్కానీలను ఎస్కవేటర్లతో తొలగించేందుకు ఉపక్రమించింది. దీనితో స్థానికులు, వ్యాపారులు ఒక్కసారిగా గుమిగూడి అడ్డుకున్నారు.
అధికారులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని సముదాయించే ప్రయత్నం చేయగా, వ్యాపారులకు, పోలీసులకు మాట మాట పెరిగి పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకొంది. కళ్యాణ్ నగర్ లో కూల్చివేతలు జరుగతున్నాయని తెలుసుకొని స్థానికులు తరలివచ్చారు. అప్పటికే స్థానిక మహిళలు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారేసరికి పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించిన వ్యాపారులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. దాంతో నగర పాలక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.