గోదావరిఖని, ఫిబ్రవరి 4: సింగరేణిలో ఇంటిపేర్ల మార్పుతో.. మారుపేర్లతో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల వారసులు పోరుబాట పట్టారు. మారుపేర్లు, విజిలెన్స్ విచారణ పెండింగ్ కేసుల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు మాటిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై భగ్గుమన్నారు. తమకు కొలువులు కల్పించాలని ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని గోలేటి నుంచి కొత్తగూడెం దాకా చేపట్టిన పాదయాత్ర మంగళవారం గోదావరిఖనికి చేరుకోగా, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వాగతం పలికారు.
నాయకులకు పూలమాల వేసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం 30 ఏండ్ల క్రితం ఎంతో మంది నిరక్షరాస్యులను మారుపేర్లతో విధులోకి తీసుకొని పనులు చేయించిందని, అయితే రికార్డుల్లో మార్పు చేయకపోవడం పెద్ద సమస్యగా మారిపోయిందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కోల్బెల్ట్లో 15మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మారుపేరు డిపెండెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, విజిలెన్స్ విచారణ లేకుండా చేస్తామని రేవంత్రెడ్డి మాట ఇచ్చి తప్పారని ధ్వజమెత్తారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు, నారాయణదాసు మారుతి, కౌటం బాబు, కుడుదుల శ్రీనివాస్ ఉన్నారు.