పెద్దపల్లి రూరల్, జూలై 4: గ్రామాల్లో అనుమానితుల పట్ల యువతీ, యువకులతోపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ బీ.మల్లేశ్ సూచించారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేటలో గ్రామస్తులతో స్థానిక గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ఎవరైన అనుమానిత వ్యక్తులు, వచ్చి సంచరించినట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సమయంలో 100 కాల్ చేస్తే పోలీస్ శాఖపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధానంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సహకరించాలని సూచించారు. అక్కడక్కడ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇండ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్తున్న సమయంలో చుట్టపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందిస్తే నిఘా ఉంచేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.