రామగిరి మార్చి 16: సింగరేణి అధికారుల తీరుపై రాజాపూర్ గ్రామస్తులు( Rajapur village) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ నిర్వహించే బ్లాస్టింగుల కారణంగా మంథని -పెద్దపల్లి ప్రధాన రహదారి రాజాపూర్ గ్రామం వద్ద రోడ్డు కుంగుబాటుకు గురైందని వారు తెలిపారు. కానీ, సింగరేణి అధికారులు వక్రీకరించి భూకంపం మూలంగా పగుళ్లు వచ్చాయని జిల్లా కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు.
ఇదే నిజమైతే మంథని నియోజక వర్గంలో ఎక్కడ లేని పగుళ్లు ఓసిపి – 2 కు చేరువుగా ఉన్న రాజాపూర్ లోనే ఎందుకు సంభవించిందో సింగరేణి అధికారులు బదులివ్వాలని డిమాండ్ చేశారు. ఇలా అధికారులను సైతం మభ్యపెట్టే విధంగా వ్యవహరించిన సింగరేణి అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. మానవహక్కులను కాలరాస్తూ సింగరేణి అధికారులు రాక్షసానందం పొందుతున్నారని ప్రజలు మండిపడ్డారు. రాజాపూర్ గ్రామానికి న్యాయం చేసి గ్రామాన్ని పూర్తిస్థాయిలో నిర్వాసిత గ్రామంగా ప్రకటించి న్యాయం చేయాలని రాజాపూర్ ప్రజలు కోరుతున్నారు.