Rathotsavam | జూలపల్లి, ఏప్రిల్ 3 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఉదయం భక్తుల ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనుల నడుమ ఉత్సవమూర్తులను రథంలో ఆసీనులను చేసి. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రాంగణంలో నరసింహస్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఆ దృశ్యాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నరసింహుడి రథోత్వసం సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేర్వేరుగా దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఇక జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛయనీ ఘటనలు చోటుచేసుకోకుండా సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.