జూలపల్లి, ఆగస్టు 30: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ (Peddapur)కు చెందిన నిరుపేద పులిపాక నర్సయ్య ఖరీదైన వైద్య చికిత్సల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతూ రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో అవి చచ్చుబడిపోయాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ చేయించుకునే స్థోమత లేక తల్లడిల్లుతున్నారు.
నర్సయ్య.. స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించినా రోగం నయం కాలేదు. ఇక్కడి వైద్యుల సూచనలతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చూపించుకున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం రెండు కాళ్లకు ఆపరేషన్ చేయాలనీ, దీనికి దాదాపు రూ.14 లక్షల దాకా ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేని ఆ పేద కుటుంబం దాతలు సహాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో వైద్య చికిత్సలు చేయించుకోలేక ఆసుపత్రి ప్రాంగణంలో కాలం వెళ్లదీస్తున్నారు. సకాలంలో ఆపరేషన్ చేయించకుంటే రెండు కాళ్లు తొలగించే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాతలు మానవత్వంతో ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు.