పెద్దపల్లిటౌన్, ఏప్రిల్ 7: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా, సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ పులిగిల్ల రవీందర్ పేర్కొన్నారు. బుధవారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా డీసీపీ మాటాడుతూ.. క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సహాయచర్యలకు ఉపయోగపడుతుందని తెలిపారు. తరచూ ఆటోల్లో జరుగుతున్న చర్యలను అడ్డుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆటోలో ప్రయాణించే మహిళలు క్యూఆర్ కోడ్‌ను ఫోన్ ద్వారా స్కాన్ చేసి బంధువులు, స్నేహితులు, పోలీసులకు పంపించాలని కోరారు.
దీంతో ఆటోల్లో వస్తువులు మరిచిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఆటో డ్రైవర్ల సమాచారం సులువుగా తెలుసుకోవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఆటో నంబర్‌ను ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అన్ని ధ్రువపత్రాలు వెంట ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనం నడిపినా, రాష్ డ్రైవింగ్, అసభ్యకర ప్రవర్తన, రాంగ్ రూట్, పరిమితికి మించి, అనుమానాస్పదంగా వ్యవహరించినా ఈ విధానం ద్వారా తక్షణమే పోలీసులకు సమాచారం తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ నిఖిత పంత్, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ట్రాఫిక్ సీఐ అనిల్‌కుమార్, ఎస్ఐ రాజేశ్, సిబ్బంది పాల్గొన్నారు.