ఓదెల, జూలై 12: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో (Odela Mallikarjuna Swamy)ఈనెల 13, 14 తేదీల్లో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో ఒకటైన మల్లన్న ఆలయంలో ఉత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. గత మార్చి నెలలో ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఓదెల మల్లికార్జున స్వామి జాతర నాలుగు నెలల పాటు అత్యంత వైభవంగా ప్రతి ఆది, బుధవారాల్లో జరిగాయి. ఈ జాతర వేసవి కాలమంతా జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జూలై నెలలోని రెండో ఆదివారం జరిగే పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో జాతర ముగియనుంది. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానుండటంతో గత వారం రోజులుగా ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. 13న రాత్రి 8 గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన,10 గంటల నుంచి పెద్దపట్నం,14 నా తెల్లవారుజామున 5 గంటలకు అగ్నిగుండం దాటడం, అనంతరం దక్షయాగ, కథా శ్రవణం, గెలుపు ఉత్సవాలు, ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వితరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. పెద్దపట్నం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈవో సదయ్య, ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గు పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదివారం జరగనున్న పెద్ద పట్నం బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర రాజధానితో పాటు సింగరేణి కాలరీస్, మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీనికి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతోపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ, ఆలయ చుట్టూ పరిసరాలను శుభ్రం చేయడం, అగ్ని గుండాల నిర్వహణ, ప్రత్యేక పూజలు నిర్వహణకు వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులను పిలిపిస్తున్నారు.