కోల్ సిటీ, జూలై 15: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్లకు ప్రత్యేక వసతులతో ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ ను ఎత్తివేయడం కుట్రపూరిత చర్య అని బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నీరటి శ్రీనివాస్ మండిపడ్డారు. రామగుండం కార్పొరేషన్ లో ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు డివిజన్లలో అభివృద్ధి పనులు జరగక గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ విషయమై అధికారులను కలిసేందుకు కార్యాలయంకు వస్తే కనీసం వెయిటింగ్ హాల్ లేకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
చివరకు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే నిన్నటి నిరసనకు నాయకత్వం వహించడం చూస్తుంటే కార్పొరేటర్లకు ఇస్తున్న గౌరవం ఏమిటో అర్ధమవుతుందన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లకు ప్రత్యేక గదులకు రూ.లక్షలు వెచ్చించే అధికారులు కార్పొరేటర్లకు ప్రత్యేక వసతులు పక్కనబెడితే ఉన్న వెయిటింగ్ హాల్ ను ఉద్దేశపూర్వకంగా తొలగించడం అగౌరవపర్చడమేనని పేర్కొన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్ల సమస్యలే పట్టించుకోని అధికారులు ఇక సామాన్య ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారనీ, పాలకవర్గం ఏర్పడిన గత ఆరు నెలల నుంచి రామగుండంలో కాలువల పూడికతీత పనులు తప్పితే చెప్పుకోదగ్గ మార్పు లేదని ఎద్దేవా చేశారు.