కోల్ సిటీ, మార్చి 17: మోసం అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) యూత్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఈదునూరి నర్సింగ్ అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి తీరా అధికారం వచ్చాక పూటకో మాటతో పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. ముఖ్యంగా యువతను మోసం చేసిందని, నిరుద్యోగ యువతకు రూ.4వేల జీవన భృతి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ గుర్తుకు లేనట్టు ఉందని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల యువతకు రూ.12లక్షల రుణం మంజూరు చేయాలన్నారు.
దళిత బంధును రూ.12 లక్షలకు పెంచుతామనీ, తెల్ల కార్డు కలిగిన ప్రతి మహిళకు నెలకు రూ.2500లు ఇస్తామంటే పాపం మహిళలు నమ్మి ఓటు వేశారన్నారు. నమ్మించి గొంతు కోయడంలో కాంగ్రెస్ తర్వాతే ఏ పార్టీ అయినా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో యూత్ డిక్లరేషన్ పై చర్చించి అమలు చేయాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు. అబద్ధాలకు ప్రాణం పోస్తే అది కాంగ్రెస్ పార్టీ ఆవుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 420 వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పి ఏడాదిన్నర గడిచినా పురోగతి లేదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే యువత సత్తా చూపిస్తామని హెచ్చరించారు.