జూలపల్లి, మార్చి 2 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లిలో డబుల్ రోడ్డు పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం పరిశీలించారు. నిట్టూరు నుంచి వెంకట్రావ్ పల్లి మీదుగా కాచాపూర్ దాకా ప్రభుత్వం డబుల్ రోడ్డు పనులకు రూ.12 కోట్లు మంజూరు చేసింది. వెంకట్రావ్ పల్లిలో డబుల్ రోడ్డుపై కల్వర్టు నిర్మాణంతో వానాకాలంలో వరద నీరు పొలాలు, నివాస గృహాల్లోకి వస్తుందని స్థానికులు పనులకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండాడ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ, పాత పంచాయతీ భవనం మిగులు పనులు, మహిళా సంఘ భవనం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం రూ.30 లక్షల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చ అరుణ, నాయకులు పుల్లూరి వేణుగోపాలరావు, దుగ్యాల శ్యామ్ రావు, పల్లె ప్రసాద్, బొజ్జ శ్రీనివాస్, శాతల్ల కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.