కోల్ సిటీ, డిసెంబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం.282 తీసుకవచ్చి మున్సిపల్ కార్మికుల పని గంటలు పెంచినప్పుడు..అందుకు తగినట్టుగా జీతాలు కూడా పెంచాల్సిన బాధ్యత ఉందని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ. ముత్యంరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుందని, వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలన్నారు.
ఈమేరకు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ ను కాంట్రాక్ట్ కార్మికులచే ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని తెలిపారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం.282 తీసుకవచ్చి 10 గం.ల పని విధానం అమలు చేసి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దోబూచులాడుతుందనీ, కాంగ్రెస్ కపట నాటకాలను ఎండగట్టేందుకు పోరాటాలే మార్గమన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణ, సమ్మక్క, రామలక్ష్మి, రవీందర్, సారయ్య, శోభన్, సాగర్, సంతోష్, ప్రతాప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.