పెద్దపల్లి మార్చ్ 11( నమస్తే తెలంగాణ) :పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రమ మట్టి, బూడిద రవాణాను(Ashe transportation )అరికట్టాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అవినీతిని నిరోధించాలని ప్రశ్నించిన తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి తడి బట్టలతో స్నానం చేసి చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడిలో ప్రవేశించి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, గులాబీ పార్టీ శ్రేణులు కౌశిక హరికి సంఘీభావం తెలిపారు. ఇటీవల అంతర్గాం మండలం కేంద్రం నుంచి ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని కౌశిక హరి మీడియా సమావేశంపెట్టి ఆరోపించారు.
అన్ని అనుమతులతో మట్టిని తరలిస్తున్నామని తమను హరి బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని ఇటుక బట్టీల యజమానులు ప్రతి ఆరోపణలు చేశారు. దీంతో నిజం నిరూపించుకునేందుకు తడి బట్టలతో పోచమ్మ గుడిలో ప్రవేశించిట్లు బీఆర్ఎస్ నేత కౌశిక హరి పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ బూడిద మట్టి దందాలో ఎమ్మెల్యే హస్తం ఉందని అందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని, సమయం చోటు చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు సైతం తమలాగే తడి బట్టలతో స్నానం చేసి బూడిద మట్టి అక్రమ రవాణాలో తమకు భాగస్వామ్యం లేదని, డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.