పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంపాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. పగలంతా విపరీతంగా ఎండ కొట్టగా.. సాయంత్రం వాతావరణం చల్లబడింది. భారీగా గాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండలంతో పాటుగా ధర్మారం, రామగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో భారీగా వర్షం కురిసింది.
దాదాపు 40 నిమిషాల పాటు రాళ్లతో కూడిన వర్షం కురవడంతో జిల్లావ్యాప్తంగా రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పంట పొలాల్లో వరి పంట పొట్ట దశలో ఉండగా రాళ్ళవాన కురవడం రైతులను తీవ్రంగా కలచివేసింది. మరోవైపు రాళ్లతో కూడిన వర్షం కురవడంతో చిన్నపెద్ద తారతమ్యం లేకుండా రాళ్లను సేకరించడంలో ఉత్సాహం చూపారు. ఈ అకాల వర్షం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని అంతర్గాం, రామగుండం, ఓదెల మండలాల్లోని పలు గ్రామాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటుగా చిరుజల్లులు పడటం, ఆ వెంటనే భారీ వర్షం కురవడంతో జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇదిలావుంటే రేపు, ఎల్లుండి కూడా జిల్లాలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.