పెద్దపల్లి, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ)/మంథని/మంథని రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత రైతులు పంటలు పండక, అప్పుల బాధతో పురుగులు మందు తాగి ఆత్మహత్యలు.. ముంబయ్.. దుబాయ్.. బొగ్గు బాయ్.. అంటూ వలస జీవితాలు ఉండేవని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి. ప్రకాశ్ (V.Prakash) అన్నారు. చెక్ డ్యామ్‌లపై జరుగుతున్న విధ్వంసాలను చూస్తే మళ్లీ కాంగ్రెస్ పాలనలో అలాంటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లి మానేరులో ధ్వంసమైన చెక్ డ్యామ్‌ను శనివారం నిజనిర్థారణ కమిటీ సభ్యులు, వి. ప్రకాశ్, సాగునీటి శాఖ విశ్రాంత సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీధర్‌రావు దేశ్ పాండే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి సీతారామారావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాఘవరెడ్డి, ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్, జర్నలిస్టులు శంకర్, బుచ్చన్న, తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు మల్లోజుల విజయానంద్లు సందర్శించారు.
ధ్వంసమైన చెక్ డ్యామ్‌ను పరిశీలిస్తున్న నిజ నిర్థారణ బృందం
అనంతరం అడవిసోమన్పల్లిలోని సంఘటన స్థలం, మంథనిలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్లో జిల్లాలోని తనుగుల, అడవి సోమన్‌పల్లి చెక్ డ్యామ్‌లను కచ్చితంగా పేల్చి వేశారని వారు నిర్థారించారు. ఈ రెండు చెక్‌డ్యామ్‌లు కొట్టుక పోలేదని.. కుట్ర పూరితంగానే వాటిని ధ్వంసం చేసినట్లు శిథిలాలాను పరిశీలిస్తే తెలుస్తుందని వీ.ప్రకాశ్ బృందం వెల్లడించింది. ఈ దాడులను తెలంగాణ ఆస్తిత్వంపై జరుగుతున్న కుట్రగానే అర్థం చేసుకోవాలని, చెక్ డ్యామ్‌లను, సాగునీటి ప్రాజెక్టులను ప్రజలు, రైతులే రక్షించుకోవాలని వారు అన్నారు. ప్రజలు, రైతులు రక్షణ దళాలుగా ఏర్పడి చెక్ డ్యామ్‌లను కాపాడుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు నీటి స్టోరేజీ లేదని.. అక్కడున్న 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నీళ్లు ఉండవని.. వారికి తెలంగాణ నీళ్లే కీలకమని చెప్పారు. ఇందుకోసం మళ్లీ తెలంగాణ నుంచి నీళ్లను దొచుకెళ్లడానికి కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు చెక్ డ్యామ్‌లను విధ్వంసం చేసిన తీరుకు బలాన్ని చేకూరుస్తుందని నిజనిర్ధారణ బృందం పేర్కొంది.
ఏ హక్కుల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అందులో మొదటిదైన నీళ్లపై మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని వీ.ప్రకాశ్ అన్నారు. స్సెన్ మియా వాగుపై, మూలసాల చెక్ డ్యామ్‌ను రైతులు అప్రమత్తమై ఎలా కాపాడుకున్నారో.. యావత్ తెలంగాణలోని రైతాంగం చెక్ డ్యామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మహదేవపూర్ పోలీసులకు ఇంజనీరింగ్ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు లేవని ప్రకాశ్ ధ్వజమెత్తారు. మూలసాల చెక్ డ్యామ్ పేల్చివేత కుట్రకు సంబంధించి నిందితులను, జిలటిన్ స్టిక్స్, ట్రాక్టర్‌ను పోలీసులకు పట్టించినప్పటికీ, తనుగుల పేల్చి వేత విషయంలో ఏ ఒక్కరినీ ఆరెస్టు చేయక పోవడం వల్ల అడవిసోమన్‌పల్లి చెక్ డ్యామ్ పేల్చివేత జరిగిందని ఆరోపించారు. ఇందుకు అడవిసోమన్‌పల్లి చెక్ డ్యామ్ శిథిలాలు అబ్స్ట్రీమ్లో పడటమే సాక్ష్యమని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైస్. రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడులు తెలంగాణలోని మానేరు, గోదావరి, వాగులపై ఒక్క చెక్ డ్యామ్‌ను కూడ నిర్మించలేదని ప్రకాశ్ గుర్తు చేశారు. ఎందుకంటే మన తెలంగాణలోని నీళ్లతోనే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉపయోగించుకునే వారని ఆయన చెప్పారు. దీని ఫలితంగా మన తెలంగాణ కరువు.. వలసల ప్రాంతంగా మారిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పని చేశారని ప్రకావ్ గుర్తు చేశారు. మానేరు నదిపై నిజాం కాలంలో ఎగువ మానేరు.. కాంగ్రెస్ పాలనలో దిగువ మానేరు డ్యామ్‌లు కట్టారని,
టీడీపీ కాలంలో మిడ్ మానేరుకు రూప కల్పన చేయగా తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ మిడ్ మానేరు పూర్తి చేయడంతో పాటు కేవలం మానేరు నదిపైనే 22 చెక్ డ్యామ్‌లు కట్టారని ప్రకాశ్ తెలిపారు. అదే విధంగా వాగులు, గోదావరి నదులపై వందలాది చెక్ డ్యామ్‌లు నిర్మించారని పేర్కొన్నారు.
అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లిని పూర్తి చేసుకోవడంతో పాటు గోదావరిపై సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క, సీతారామ బ్యారేజీలైన ఆరు బ్యారేజీలను నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని వీ.ప్రకాశ్ అన్నారు. కేసీఆర్ నిర్మించిన బ్యారేజీలు, చెక్ డ్యామ్‌ల కారణంగా తెలంగాణలో నీటి వనరులు విపరీతంగా పెరడంతో పాటు వ్యవసాయం పండుగలా మారిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో వలసలు లేని తెలంగాణను కేసీఆర్ రూపొందించారని ప్రకాశ్ కొనియాడారు. అలాంటి వ్యవసాయానికి జీవం పోసిన చెక్ డ్యామ్‌లకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది అక్రమార్కులు ఇసుకను దోచుకునేందుకు చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేస్తూ భవిష్యత్తులో తెలంగాణను మళ్లీ కరువు ప్రాంతంగా మార్చుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి ఉపయోగకరంగా ఉన్న చెక్ డ్యామ్‌లను ధ్వంసం చేస్తుంటే ప్రభుత్వం స్పందించక పోవడం నిజంగా బాధకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 1800ల చెక్ డ్యామ్‌లు అవసరమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 850 చెక్ డ్యామ్‌లను పూర్తి చేసిందన్నారు. మిగిలినవి కట్టాల్సి ఉండగా నిధులు లేని కారణంగా ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. నూతనంగా చెక్ డ్యామ్‌లు నిర్మించడం అనే విషయాన్ని పక్కన పెడితే ఉన్న వాటిని కాపాడుకోక పోవడం నిజంగా బాధకరమన్నారు. తమకు ఎవరితో.. ఏ పార్టీతో సంబంధం లేదని.. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం ఏ విధంగా పని చేశామో.. తెలంగాణ జల వనరులను కాపాడేందుకు అదే విధంగా పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో తెలంగాణ జల సాధన ఉద్యమం అవసరమని ఆయన పేర్కొన్నారు.