Eye donation | కోల్ సిటీ , ఏప్రిల్ 11: తాను మరణించినా.. అతని కళ్లు మాత్రం ఈ లోకంను చూస్తూనే ఉన్నాయి. మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించాడు. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన సామాజిక సేవకుడు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, చేయూత ఫౌండేషన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురువు నీలం ఐలయ్య (48) శుక్రవారం మృతి చెందాడు.
ఆయన మృతితో దుఃఖ సాగరంలో ఉండి కూడా కుటుంబ సభ్యులు ఐలయ్య నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఐలయ్యకు 2005లో ఆయన తల్లి రాధమ్మ ఒక కిడ్నీ దానం చేసింది. అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్న ఐలయ్య బాలల సంక్షేమం సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. అలాగే పలువురికి ఆరోగ్య ప్రదాతగా యోగా శిక్షణ కూడా ఇస్తున్నాడు.
ఈ క్రమంలో ఐలయ్య అకాల మృతి పట్ల స్థానిక స్వచ్ఛంద సంఘాల సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా సదాశయ ఫౌండేషన్ విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద మనసు చేసుకొని ఐలయ్య నేత్రాలను దానం చేశారు. ఎల్పీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నిషియన్ ప్రదీప్ చే నేత్రాలను సేకరించి హైదరాబాద్ కు తరలించారు. ఐలయ్య మృతి పట్ల ఫౌండేషన్ సభ్యులు శ్రవణ్ కుమార్, లింగమూర్తి, కేఎస్ వాసు, లయన్స్ క్లబ్ సభ్యులు మల్లికార్జున్, తానిపర్తి విజయలక్ష్మీ, సదాశయ మహిళా అధ్యక్షురాలు వెల్లి కవిత అనంత రాములు, శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.