కోల్ సిటీ, అక్టోబర్ 21: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మాజీ పోలీస్ కానిస్టేబుల్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీనర్సయ్య మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న పలువురిని గుర్తించి ప్రతి ఏటా హైదరాబాద్లో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డులతో సత్కరిస్తారు.
దీనిలో భాగంగా దేవి లక్ష్మీనర్సయ్య ఇప్పటివరకు దాదాపు 60కి పైగా రక్తదానాలు చేయడంతోపాటు విద్యార్థులకు, యువకులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ తరగతులు ఇవ్వడమే గాకుండా జేసీఐ సంస్థ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు చేయూత లాంటి సమాజ హిత కార్యక్రమాలను గుర్తించి ఆసియన్ ఎక్సెన్స్ అవార్డు -2025 కు ఎంపిక చేసింది. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో జరిగే సంస్థ కార్యక్రమంలో లక్ష్మీనర్సయ్యను ఈ అవార్డుతో సత్కరించనున్నట్లు తెలిపారు. కాగా, ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన లక్ష్మీనర్సయ్యను డా. లయన్ ఆకుల రమేష్ అభినందించి హర్షం వ్యక్తం చేశారు.