ఎల్లమ్మ చెరువు కట్ట, మున్సిపల్ కాంప్లెక్స్‌తో పాటు పలు ప్రాంతాల సందర్శన
శాంతిభద్రతల పర్యవేక్షణపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన
peddapally|పెద్దపల్లి, మార్చి27, (నమస్తే తెలంగాణ): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలను ఆయన బుధవారం అర్థరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని సాగర్ రోడ్డు ప్రాంతంలో పెద్దపల్లి పోలీసులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం, ఎల్లమ్మ చెరువు కట్ట ప్రాంతం, మున్సిపల్ కాంప్లెక్స్ ఏరియా ప్రాంతాలను, పట్టణంలోని ఏటీమ్ సెంటర్లను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా అర్ధరాత్రి సమయంలో బయట తిరుగుతున్న వారిని ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అలాగే ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు చేపడుతున్న పోలీస్ పెట్రోలింగ్ తోపాటు, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వారి పట్ల, గంజాయి, మద్యం సేవించి తిరిగే ఆకతాయిలను గురించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నుండి డ్రోన్ ద్వారా ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఏటీఎం సెంటర్ లను సందర్శించి అలారం సిస్టమ్, సిసి కెమెరాల పని తీరు, ఇతర భద్రత విషయాలపై సెక్యూరిటీ గార్డ్ తో మాట్లాడి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అదేవిదంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని బ్యాంకులలో అలారం సిస్టం, సీసీ కెమెరాలు పనితీరు, సెక్యూరిటీ గార్డ్స్, ఇతర భద్రత పరమైన ఏర్పాట్లుపై స్వయంగా వెళ్లి తనిఖీ చేసి సంబందించిన అధికారులతో మాట్లాడి భద్రత చర్యలు సరిగా లేని బ్యాంకు లలో ఏర్పాటు చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మద్యం షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్న సమయపాలనపై పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి సీఐ, ఎస్ఐ, సిబ్బంది ఉన్నారు.