Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 14: బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో అధికారులు పారదర్శకత పాటించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించి ఇతర సంఘాలను అవమానిస్తారా..? అని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఈదునూరి నర్సింగ్ ప్రశ్నించారు.
గోదావరిఖనిలో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమే అన్నట్టు కొనసాగించడం బాధాకరమని పేర్కొన్నారు. వేదికపై కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఆహ్వానించి ఒకరిద్దరు దళిత సంఘాల నాయకులను పిలిచి మిగతా పార్టీలను విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ సాక్షిగా ఈ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే పెత్తనం చెలాయించడం, ఇతర పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అన్ని రాజకీయ పార్టీలు, అన్ని దళిత సంఘాలకు సమాన గౌరవం ఇవ్వాల్సింది పోయి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జరుగుతున్నా అధికారులు చోద్యం చూడటం సరైంది కాదన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, ఈసారి అంబేద్కర్ జయంతి వేడుకల్లో సమానత్వం కొరవడిందని వారు ఆరోపించారు. అంబేద్కర్ అందరివాడు అంటూ వేదికపై ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులు ఆచరణలో మాత్రం ఒంటెద్దుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అర్హత లేని చోట మోట నాయకులను కూడా అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో వేదికపై కూర్చోబెట్టడం నియంత ధోరణికి నిదర్శనమని వాపోయారు.