గోదావరిఖని : సింగరేణి కొత్తగూడెం రీజియన్ పరిధిలోని వికె 7ఓసి, సత్తుపల్లి ఓసీలలో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య దీక్షల్లో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం సీతారామయ్య మాట్లాడుతూ 2015 లో కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టంలో మార్పులు చేయడం వల్ల దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్ లను వేలం ద్వారా ప్రైవేటు వారికి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంతో సింగరేణిలో కొత్త గనులు రావడం లేదన్నారు.
తెలంగాణలో ఉన్న కొత్త గనులను ప్రైవేటు కు కాకుండా సింగరేణి కి ఇవ్వాలని ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బొగ్గు తీసే పనిని కాంట్రాక్టుకు కాకుండా సింగరేణి ఉద్యోగులే తీసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వంగ వెంకట్, మల్లికార్జున్, రంగు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.