ప్రమాద వశాత్తు మరణిస్తే రూ.5లక్షల పరిహారం
రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తున్న సర్కారు
రైతు బీమాతో జిల్లాలో 860 కుటుంబాలకు రూ.42కోట్ల 95లక్షల ప్రయోజనం
పెద్దపల్లి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అన్నదాతల కుటుంబాలకు సర్కారు అండగా నిలుస్తున్నది రైతు బీమా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ పథకం విశేష ఆదరణ పొందుతున్నది. ఈ పథకం ఈ నెల 13తో నాలుగో ఏట అడుగుపెట్టనున్నది. ఈ నేపథ్యంలో ఈ పథకం పొందేందుకు ఇదివరకే నమోదై ఉన్న పాత రైతుల డేటా ఆటోమేటిక్గా అప్డేట్ కానున్నది. కొత్తగా ఈ పథకం పొందేందుకు ఈ నెల 14 వరకు గడువు ఉంది. ఒక్కో రైతు తరఫున ప్రభుత్వమే రూ.2, 271.50 చొప్పున ప్రీమియాన్ని బీమా కంపెనీకి చెల్లిస్తున్నది. దీంతో ఒక్కో రైతుకు రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతుకు ఏదైనా ఆపద ఎదురై మరణిస్తే అతడి నామినీకి, కుటుంబానికి ఆ పరిహారం మొత్తం అందుతుంది. ఈ నెల 3వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్ బుక్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డులను సంబంధిత ఏఈవోలకు అందించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో రైతు బీమా పథకం కూడా విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పట్టాదారు పాస్బుక్ ఉండి రైతు బంధు సాయం పొందుతున్న 18-59 ఏళ్లలోపు వయసున్న రైతులందరూ ఈ రైతు బీమాకు అర్హులే. 2018 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతున్నది. ఆధార్ కార్డులో ఉన్న వయసును ప్రామాణికంగా తీసుకుని బీమా వర్తింపు జరుగుతున్నది. మూడేళ్లలో జిల్లాలో 860 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలకు రూ.42కోట్ల 95లక్షల బీమాను చెల్లించారు.
860 కుటుంబాలకు రూ. 42కోట్ల 95లక్షల బీమా పంపిణీ..
మూడేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 860 రైతు కుటుంబాలకు రూ. 42.95కోట్ల సాయం అందింది. 2018-19వ సంవత్సరంలో జిల్లాలో 315 మంది రైతులు మృతి చెందగా 314 మంది రైతుల కుటుంబాలకు రూ.15కోట్ల 70లక్షలు బీమాగా అందాయి. 2019-20వ సంవత్సరంలో జిల్లాలో 358 మంది రైతులు మృతి చెందగా 350 మంది రైతుల కుటుంబాలకు రూ.17కోట్ల 50లక్షల బీమా అందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 234 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా 195 మంది కుటుంబాలకు రైతు బీమా కింద రూ.9కోట్ల 75లక్షల సాయం అందింది. ఇంకా మిగతా రైతులకు అందాల్సి ఉంది.
కొత్త రైతులకు అవకాశం
రైతు బీమాకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొత్తగా పాసు పుస్తకాలు పొందిన వారు కూడా రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన రైతులు వివరాలను స్థానిక ఏఈవోలు పరిశీలించి జాబితా తయారు చేస్తారు. రైతులు వ్యవసాయం చేస్తూ అకాల మృతి చెందితే నామినీకి పరిహారం అందుతుంది. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. వాటిని వెంటనే మరుసటి రోజు ఆన్లైన్ చేసి ఎల్ఐసీ వారికి పంపుతాం. దరఖాస్తులతోపాటు రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, నామినీ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్లను అందజేయాలి.
-తిరుమల్ ప్రసాద్, డీఏవో పెద్దపల్లి జిల్లా