Child marriage-free district | పెద్దపల్లి, జూన్19: వచ్చే ఏడాది మార్చి వరకు బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి ప్రకటించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల హక్కుల సంరక్షణపై సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలకు అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య తదితర అంశాలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలను నివారించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం జిల్లాలో పకడ్బందిగా అమలు చేయాలని, స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతను అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ పిల్లలకు మంచి రుచికరమైన పౌష్టికాహారం నాణ్యతకు అందించేలా చూడాలన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కింద బాల కార్మికుల పనిచేసే పిల్లలను గుర్తించి, సరైన పునరావాసం కల్పించాలన్నారు. జిల్లాలో ఎక్కడా భిక్షాటనలో చిన్న పిల్లలు ఉండకుండా చూడాలన్నారు. తప్పిపోయిన పిల్లలను సొంత తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లల వివరాలు సేకరించి ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో చేర్పించామని అధికారులు తెలిపారు. పిల్లలపై జరిగే అఘాయిత్యాల నివారణకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీ కరుణాకర్, జిల్లా సంక్షేమ అధికారి పీ వేణు గోపాల్ రావు, డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, ఏసీపీలు కృష్ణ, రమేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.