జమ్మికుంట/పెద్దపల్లి/జ్యోతినగర్ (రామగుండం), నవంబర్ 25 : కాజీపేట్ – బల్లార్షా రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం జమ్మికుంట, పోత్కపల్లి, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లను పరిశీలించి, అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయనకు ఎక్కడికక్కడ వినతిపత్రాలు పోటెత్తాయి. జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందజేశారు. పలు డిమాండ్లపై జీఎంతో చర్చించారు. జమ్మికుంట, కొలనూర్, పోత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో అన్ని రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని, ఆర్వోబీలు నిర్మించాలని, ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు.
జమ్మికుంటలో జీఎంతో కౌశిక్‌రెడ్డి భేటీ
జమ్మికుంట మోడల్ రైల్వే స్టేషన్‌ను సందర్శనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ను ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కలిశారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, నాయకులు, వ్యాపారులతో కలిసి పట్టణ పురవీధుల్లో ర్యాలీగా స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ అతిథి గృహంలో జీఎం అరుణ్‌కుమార్, ఏజీఎం అమిత్ గోయల్, తదితర ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. తర్వాత జమ్మికుంట రైల్వే స్టేషన్ సమస్యలు, ప్రయాణికుల ఇబ్బందులు, సౌకర్యాలు, తదితర అంశాలపై వినతి పత్రం అందించారు. తర్వాత జీఎంతో మాట్లాడారు. జమ్మికుంట స్టేషన్లో గతంలో దానాపూర్, దక్షిణ్, రాయ్‌పూర్, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు హాల్ట్ ఉండేవని, కారాణాలేవైనా ఇప్పుడు ఆగడం లేదని తెలిపారు. వందలాది గ్రామాల కూడళి అయిన జమ్మికుంట నుంచి వేలాది మంది సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని, ఫుటోవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అంతేకాకుండా మేదరివాడ సమీపంలో రోడ్డు వెడల్పు, రైల్వే గోడను ఆనుకుని జీవనోపాధి కోసం చిరువ్యాపారుల డబ్బాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు జీఎం సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కౌన్సిలర్లు పాల్గొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పట్టణ సీఐ రాంచందర్‌రావు, ఆర్పీఎఫ్ అధికారులు, బందోబస్తు చేపట్టారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..