కరీంనగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : మూడో దశ కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే సత్ఫలితాలనిస్తోంది. ఈనెల21 నుంచి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో వైద్యశాఖ అధికారులు సర్వే చేయిస్తుండగా, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల పరిధిలో బుధవారమే ముగిసింది. కరీంనగర్ అర్బన్‌లో మాత్రం గురువారం పూర్తయింది. జిల్లాలో మొత్తం 4,642 బృందాలు విధులు నిర్వర్తించాయి. ఈ సీజన్లో మొదటి విడుత సర్వేను త్వరగా పూర్తిచేసిన బృందాలతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చొరవ తీసుకుని రెండో విడుత సర్వే చేయిస్తున్నారు. మొదటి విడుత త్వరగా ముగించిన బృందాలు, గత నెల 31 నుంచే రెండో విడుత నిర్వహిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. రెండో విడుతలో ఇప్పటివరకు 83,434 ఇండ్లల్లో సర్వే పూర్తయిందని వారు స్పష్టం చేస్తున్నారు.
సర్వేతో ముందస్తు చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వేతో కొవిడ్ వ్యాప్తిని అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోగలిగారు. కరోనా టీకాల్లో ఇప్పటికే జిల్లా రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. అయి తే, కరోనా లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వ్యాప్తిని నిరోదించే అవకాశాలు ఉంటాయని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జ్వర సర్వేను చేట్టింది. కొవిడ్ రెండో సీజన్లోనూ ఇదే విధంగా జరిగిన జ్వర సర్వే సత్ఫలితాలను ఇచ్చింది. కేవలం సర్వేకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఐసొలేషన్ కిట్స్ కూడా అందించింది. జిల్లాలో మొత్తం 2.80 లక్షల నివాస గృహాలు ఉండగా ఈ సీజన్లో మొదటి విడతలో 2,79,202 ఇండ్లల్లో బృందాలు సర్వే చేశాయి. సుమారు 10 లక్షలకు పైగా మందిని పరిశీలించి 5,857 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, హోం ఐసొలేషన్ కిట్స్ అందించాయి. రెండో విడుత సర్వేలో అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాయి. అప్పటికీ ఇప్పటికీ వారి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నట్లు సర్వే బృందాలు గుర్తిస్తున్నాయి. రెండో విడుతలో ఇప్పటివరకు 83,434 ఇండ్లల్లో సర్వే చేసిన బృందాలు కేవలం 1,142 మందికి మాత్రమే అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించాయి. వీరికి సిబ్బంది ఐసొలేషన్ కిట్స్ అందించారు.
నగరంలోనే అత్యధిక జ్వరాలు
కరీంనగర్ అర్బన్‌లోనే అత్యధిక మందికి జ్వ రం వస్తున్నట్లు సర్వేలో తేలింది. 64,101 నివా స గృహాలున్న నగరంలో 3 లక్షలకుపైగా జనాభా ఉంటోంది. గురువారంతో మొదటి సర్వే ముగియగా, ఎక్కువమందికి జలుబు, దగ్గు, జ్వరాలు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా మొత్తంగా 5,857 మంది జ్వర పీడితులను గుర్తిస్తే ఇందులో కరీంనగర్‌లోనే 2,114 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోనూ రెండో విడుత సర్వేను ప్రారంభించేందు కు అధికారులు సమాయత్తమవుతున్నారు.
జ్వరాలు తగ్గుతున్నా జాగ్రత్తగా ఉండాలి
మొదటి, రెండో విడుత సర్వేతో పోల్చుకుంటే జిల్లాలో దగ్గు, సర్ది, జ్వరాలు తగ్గుతున్నాయి. అనుమానిత లక్షణాలున్న వారు కూడా కోలుకుని సాధారణ స్థితికి వస్తున్నారు. అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పెండ్లిళ్లు, జాతరలకు వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. జ్వర సర్వే కారణంగా అనుమానిత లక్షణాలున్నవారిని ముందే గుర్తించగలిగాం. వారికి హోం ఐసొలేషన్ కిట్స్ అందించాం. ఈసారి చాలా మంది ఇంటి నుంచే కోలు కుంటున్నారు. ఇది మంచి పరిణామమే.. అయి నా ఈ ముప్పు ఇంకా తొలగలేదు. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
– జువేరియా, కరీంనగర్ డీఎంహెచ్‌వో