Palakurthi | పాలకుర్తి, జూలై 24 : పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు. భాంలానాయక్ తండాకు చెందిన గిరిజన మహిళ సుజాత బతికున్నప్పటికీ చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించి సుజాత చెందిన 24 గుంటల వ్యవసాయ భూమిని వేరే వ్యక్తులకు విరాసత్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఇటీవల సుజాతకు రైతు బరోసా డబ్బులు రాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ, బ్యాంకు కి వెళ్లి వివరాలు కనుక్కోగా అసలు విషయం బయటపడింది. తాను బతికి ఉండగానే, ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి తమ భూమిని వేరే వాళ్లకు విరసత్ చేశారని తెలుసుకుని, జిల్లా కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్కు ఫిర్యాదు చేసింది. గిరిజన మహిళకు అన్యాయం చేసిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ విచారణ చేపట్టి నివేదకను ఉన్నతాధికారులకు అందజేస్తానని చెప్పారు.