Peddapally | పెద్దపల్లి టౌన్, మే 28: ఈ నెల 21న జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదన కుమారస్వామి డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆపరేషన్ కగారును నిలిపివేయాలని పోస్టర్లను బుధవారం ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఆదివాసులను అతి కిరాతకంగా హత్య చేస్తుందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాల కేశవరావు మరో 26 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన చతిస్గడ్ ప్రభుత్వం మృతదేహాలు ఇవ్వకుండా అడ్డుకుంటుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాలను కుటుంబ సభ్యులకి అందజేయాలంటే డిమాండ్ చేశారు. ఇక్కడ పౌర హక్కుల సంఘం విరసం, ప్రజాఫ్రంట్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల నాయకులు గాండ్ల మల్లేశం, బొడ్డుపల్లి రవి, బొంకూర్ లక్ష్మణ్, పులిపాక రవీందర్, గుమ్మడి కొమురయ్య, మార్వాడి సుదర్శన్, కల్లెపెల్లి అశోక్ శ్రావణ్, సుచరిత, సంతోషిని బాలసాని రాజయ్య తదితరులు పాల్గొన్నారు.