Koppula Eshwar | ధర్మారం, జనవరి12: మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతంలో జరిగే మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సన్నద్ధం కావాలని రాష్ట్ర మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా తుమ్మల రాంబాబు నియామకం కాగా ధర్మారంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన వార్డు సభ్యుడు నార ప్రేమ్ సాగర్ ఎన్నికయ్యారు. కాగా వారిద్దరూ పార్టీ నాయకులతో కలిసి సోమవారం కరీంనగర్ లోని శ్రీపురం కాలనీలో ఉన్న ఈశ్వర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు, సమ్మక్క సారలమ్మ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ ను ఈశ్వర్ సన్మానించి అభినందించారు. మర్యాదపూర్వకంగా వారు ఈశ్వర్ కు పూల మొక్కలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న ధర్మారం మండల కేంద్రంలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి రాబోయే స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా కృషి చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. స్థానికంగా పార్టీని విస్తరించి క్యాడర్ ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని అన్నారు. గత ఎన్నికల్లో ధర్మారంలో రెండు ఎంపీటీసీలు బీఆర్ఎస్ విజయం సాధించిన స్ఫూర్తితో ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా ఆ స్థానాల విజయానికి నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా మండలంలో కూడా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని అందుకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. గ్రామాలలో ప్రజలను కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాం లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి వివరిస్తూ వారితో మమేకం కావాలని అన్నారు.
రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఉందని ఈ క్రమంలో త్వరలో జరగబోయే మండల పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించాలనే ఆలోచన మొదలైందని దీనిని పార్టీ నాయకులు అనువుగా మార్చుకోవాలని అని ఈశ్వర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం ప్యాక్ మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యులు పూస్కురు రామారావు, ఎగ్గేల స్వామి, ఆర్బీఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల రాజయ్య, పార్టీ సోషల్ మీడియా మండలాధ్యక్షుడు దేవి నళినికాంత్, ప్రతినిధి సల్వాజి మాధవరావు, నాయకులు అయిత వెంకటస్వామి, దేవి రాజారాం, దేవి రాజేందర్, ఎండీ షరీఫ్, రాగుల చిన్న మల్లేశం, కాంపల్లి అపర్ణ, గంధం తిరుపతి, గుమ్ముల నర్సయ్య, అజ్మీర శ్రీనివాస్ నాయక్, బోయిని మల్లేశం, కాంపల్లి చందు, వేల్పుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.