కరీంనగర్ విద్యానగర్/ కలెక్టరేట్, జూలై 2 : పేగుబంధం కరిగింది. పేగుతెంచుకొని పుట్టిన బిడ్డను అనాథను చేయడం ఇష్టం లేక తల్లడిల్లింది. తరుచూ అనారోగ్యం బారిన పడడం, చికిత్సకు ఖర్చు చేయించే స్థోమత లేకపోవడంతో వద్దనుకొని ఆ పదిహేను నెలల కొడుకును ఊయలలో వదిలేసినా.. తిరిగి తమకు ఇవ్వాలని, గుండెల్లో దాచుకుంటామని ప్రాధేయ పడింది. చివరకు చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది. వివరాల ప్రకారం.. పిల్లలను చెత్తకుప్పల్లో వేయకుండా.. నిరాదరణకు గురికాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సరికొత్త ఆలోచన చేశారు. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఊయల ఏర్పాటు చేసి, పిల్లలను వద్దనుకునేవారు అందులో వేయాలని సూచించారు. అయితే అల్లారుముద్దుగా పెరగాల్సిన తమ పదిహేను నెలల కొడుకు తరచూ అనారోగ్యం బారిన పడుతుండడం, ఖర్చులు భరించే స్థోమత లేక ఆ తల్లడిల్లిన తల్లిదండ్రులు, ఆ ఊయలలో వదిలేస్తేనైనా మెరుగైన వైద్యం అందుతుందని భావించారు. గత నెల 28న ఆ బిడ్డను అందులో వదిలి వెళ్లారు.
కాగితంపై పేరు, పుట్టిన తేదీ కూడా రాశారు. వైద్యులు గమనించి, మహిళా శిశు సంక్షేమ శాఖ విభాగానికి సమాచారం ఇచ్చారు. తర్వాత ఆ బాబును కరీంనగరంలోని శిశుగృహకు తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు సంబంధితాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే ఏమైందో ఏమో గానీ బాబుని వద్దనుకున్న ఆ తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. తమ బాబు తమకు కావాలంటూ జిల్లా బాలల సంక్షేమ సమితి వద్దకు వచ్చి ప్రాధేయపడ్డారు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆ బాబు, తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్‌కార్డులు, మెడికల్ రిపోర్టులు పరిశీలించారు. తల్లిదండ్రుల కొడుకేనని నిర్ధారించారు. అనంతరం భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక నుంచి బిడ్డలను సక్రమంగా చూసుకోవాలని సూచించి, జడ్పీ కార్యాలయంలోని బాలరక్ష భవన్లో బాబును ఆ తల్లిదండ్రులకు బుధవారం అప్పగించారు. తమ బిడ్డను తమకు క్షేమంగా అప్పగించిన జిల్లా అధికారులు, సీడబ్ల్యూసీ సిబ్బందికి ఆ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతూ కృతజ్ఞతలు తెలిపారు.