కాల్వశ్రీరాంపూర్, జూలై 26: చుట్టూ గుట్టలు, ఎత్తయిన ప్రాంతం నుంచి జాలువారుతున్న నీళ్లతో జాఫర్ఖాన్పేట-వెన్నంపల్లి శివారులోని రామగిరిఖిల్లా గుట్టల సమీపంలో ఉన్న పాండవలొంక జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తున్నది. కాల్వశ్రీరాంపూర్ వయా వెన్నంపల్లి నుంచి ముత్తారం వైపు వెళ్లేమార్గంలో జాఫర్ఖాన్పేట నుంచి సుమారు 4కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తే వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది.
చుట్టూ సుమారు వందెకరాల మేర బండరాళ్లతో పచ్చిక బయళ్లు ఉన్న ఈ ప్రాంతంలో వనభోజనాల కోసం ఈ శ్రావణ మాసంలో జిల్లాలోని పలుగ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారు. ద్వాపర యుగంలో పాండవులు కొన్ని రోజులు ఇక్కడ వనవాసం చేయగా, ఈ ప్రాంతాన్ని పాండవలొంక అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు.