Jagityal | జగిత్యాల, మే 29 : మంచిర్యాల జిల్లా ఇందన్ పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు బలరాం ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్షి గా విధులు నిర్వహిస్తున్న జగిత్యాల పట్టణానికి చెందిన చంద్రమౌళి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు.
ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించగా పంచాయతీ కార్యదర్శుల సంఘం సభ్యులు, టీఎన్జీవో, టీజీవో, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసినప్పటి నుండి పంచాయతీ కార్యదర్శులు రాత్రనకా, పగలనకా కష్టపడుతూ గ్రామాలలో పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం నుండి బడ్జెట్ రాకపోయినా గ్రామ పంచాయతీలలో త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వము నుండి ఒత్తిడి వస్తుండడంతో స్వంతంగా డబ్బులు ఖర్చు చేసి బిల్లుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని, గ్రాంట్ ఉన్నప్పటికీ ఆ బిల్లులు మంజూరు కాక పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
గుండెపోటుతో మృతి చెందిన చంద్రమౌళికి ప్రభుత్వం నుండి దాదాపు నాలుగు లక్షల రూపాయలు బిల్లులు రావాల్సి ఉందని, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి, యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో చాలా రోజుల నుండి మానసిక వేదన అనుభవిస్తున్నాడన్నారు. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనతో చంద్రమౌళి మృతి చెందాడని అన్నారు. చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పూదరి నరేందర్, బాబురావు, శ్రవణ్ కుమార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుకూరి రవిబాబు, టీఎన్జీవో జగిత్యాల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు రామ్ కిషన్ రావు, నయీమ్, సిద్దిపేట జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మురళి, సంతోష్, నాయకులు శ్రీనివాస్ నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.