Huzurabad | హుజురాబాద్ రూరల్, నవంబర్ 3 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎనలేని హామీలు ఆరు గ్యారెంటీల లాంటి 420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను ఇబ్బందులకు కురిచేస్తుందని మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హుజరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు లకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం లేదని మండిపడ్డారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారని గుర్తు చేశారు. గత సంవత్సరం పంటకు ఇప్పటివరకు రూ.500 బోనస్ ఇవ్వ లేదని, ఈ ఈసారి తప్పకుండా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేవరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ అండగా నిలబడి కొట్లాడుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా రైతుబంధు రెండు సార్లు ఏగవేసి రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
హామీ ప్రకారంగా ఎకరానికి రూ.15 వేల రైతుబంధు రైతులకు ఇవ్వాలని పేర్కొన్నారు. మొంథా తుఫానుకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు గాను వరి రైతులందరికీ ఒక ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తడిసిన వడ్లతోపాటు రైతుల పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిరోషా కిరణ్, భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.