కమాన్చౌరస్తా, మార్చి 24 : శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు ఎదురొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ బాధ్యులు డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో నిర్వహించే పరీక్షలు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సుప్మా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షల తేదీలను ప్రకటించకూడదని, ఆ తేదీలను ప్రకటించి, పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వస్తే రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఆ పరీక్షలను బహిషరిస్తామని చెప్పారు. 20 నెలలుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో చాలా యాజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాయని, ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రీయింబర్స్మెంట్ విడుదల చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్మా ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేశ్, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి గోవిందవరం కృష్ణ, పలు విద్యాసంస్థల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.