ధర్మారం/రామడుగు/బోయినపల్లి, జూలై 29 : కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లో ఆదివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించిన అధికారులు, సోమవారం మరో మోటర్‌ను ఆన్ చేశారు. ప్రస్తుతం 2,3,5,6,7 పంపులు నడుస్తున్నాయి.
ఒక్కో మోటర్ ద్వారా 3,150 చొప్పున 15,750 క్యూసెక్కులు డెలివరి సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడి నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. అక్కడ రిజర్వాయర్ గేట్లను ఎత్తడంతో అంతే మొత్తంలో జలాలు అండర్ టన్నెళ్లలో గ్రావిటీ ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు చేరుకుంటున్నాయి.
అక్కడ సైతం నిన్నామొన్నటిదాక నాలుగు బాహుబలి మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించిన అధికారులు, సోమవారం ఐదో మోటర్‌ను ఆన్ చేశారు. మొత్తంగా 15,750 క్యూసెక్కులు లిఫ్ట్ చేస్తుండగా, డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసి పడ్డ జలాలు సుమారు 5.7 కిలోమీటర్లు ఉన్న గ్రావిటీ కాలువ ద్వారా వరదకాలువకు చేరుకొని అక్కడి నుంచి మధ్యమానేరుకు పరుగెడుతున్నాయి.
సోమవారం సాయంత్రానికి రెండున్నర టీఎంసీల జలాలను మధ్యమానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారి రాంప్రదీప్ తెలిపారు. ఇన్‌ఫ్లోను బట్టి అవుట్‌ఫ్లో కొనసాగుతుందని వివరించారు. మధ్యమానేరు పూర్తి నీటి సామర్థ్యం 27.054 టీఎసీలుకాగా, ప్రస్తుతం 7.491 టీఎంసీలకు చేరుకుంది. ఎత్తి పోతల ద్వారా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో మధ్యమానేరులో నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది.