శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Shankarapatnam) మండలంలోని మెట్పల్లిలో ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. వివాహం అనంతరం బరాత్ నిర్వహిస్తుండగా వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. దీంతో పది మంది గాయపడ్డారు. మెట్పల్లికి చెందిన బాకారాపు ప్రభాకర్ గురువారం తన కుమార్తె వివాహం నిర్వహించారు. అప్పగింతలు ముగిసిన తర్వాత వధూవరులను సాగనంపుతున్నారు. ఈ సందర్భంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారుపై డ్రైవర్ అదుపు కోల్పోయాడు.
దీంతో కారు ముందు డ్యాన్సులు చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై పది మందికిపైగా మహిళలు గాయపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారని స్థానికులు వెల్లడించారు. మిగిలినవారిని హుజూరాబాద్, జమ్మికుంట దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. ఆనందంగా సాగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.